September 5, 2026
శ్రీ. మాధవరావు కొరుప్రోల

గగనవీధి నేలుతున్న..మహిమాన్విత మా జెండా..!

గగనవీధి నేలుతున్న..మహిమాన్విత మా జెండా..!
గురు శక్తిని వర్షించే..తత్వవిదిత మా జెండా..!

ముచ్చటైన మువ్వన్నెల..పరమార్థం మనోహరం..
అన్నపూర్ణ హాసాద్భుత..నిత్యహరిత మా జెండా..!

స్వచ్ఛతకే పుట్టినిల్లు..మెఱుపులకే శోభనింపు..
శ్వేతపూర్ణ అమాయికత..వర్ణాంకిత మా జెండా..!

ఊపిరులకు ఊపిరయే..త్యాగోదయ కాషాయం..
విశ్వమైత్రి సాధనలో..సంయోగిత మా జెండా..!

సమరవాంఛ చల్లార్చే..ధర్మచక్ర ధారిణిరో..
సప్తచక్ర సంచారీ..ధ్యానసహిత మా జెండా..!

తెలుగుదనం పూరించిన..ఒక పింగళి చైతన్యం..
సామరస్య సౌమనస్య..సంశోభిత మా జెండా..!

నిజమాధవ గీతామృత..ప్రబోధాగ్ని సాక్షి తనే..
కరుణపూర్ణ కమలాలయ..తేజకలిత మా జెండా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *