తెలుగు గజల్ కవులకు మనవి.
డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు, డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాసిన గజళ్ళు ఔత్సాహిక గజల్ కవులకు స్ఫూర్తిదాయకం.
డాక్టర్ సి నారాయణరెడ్డి గారు వ్రాసిన గొప్ప గజళ్ళను స్ఫూర్తిగా తీసుకొని నాటి నుండి నేటి వరకు పదివేలకు పైగా గజల్ గాన కచేరీలు చేసి ముమ్మారు గిన్నీస్ బుక్ రికార్డును కైవశం చేసుకున్న డాక్టర్ సినారె మానసపుత్రుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తమ అపూరూప గానశైలీ ప్రదర్శనల వలన తెలుగు గజల్ కు అద్భుతమైన ఆకర్షణ ఏర్పడిందనే సంగతి తెలుగుజాతికి విదితమే.ఒకానొక సభలో సినారె గారు గజల్ శ్రీనివాస్ గానశైలిని ప్రశంసిస్తూ “కరుణశ్రీ వ్రాసిన పుష్పవిలాపానికి ఘంటసాల వారు ఎంతటి ప్రజాదరణ కలిగించారో అదే విధంగా పుస్తకాలకే పరిమితమైన తెలుగు గజల్ ని తన గానంతో విభిన్నమైన శైలిలో ప్రదర్శిస్తూ తెలుగు గజల్ కు బహుళ ప్రాచుర్యం కలిగించాడు”అన్నారు.
2005లో డాక్టర్ గజల్ శ్రీనివాస్ ‘గజల్ చారిటబుల్ ట్రస్ట్’స్థాపించి ఔత్సాహిక కవులకు గజల్ రచనలపై సదస్సులు నిర్వహించి గజల్ రచనపై అవగాహన కలిగించారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇలా సదస్సులు నిర్వహించి వేలాది గజల్ కవులకు స్వాగతం పలుకుతూ గజల్ కవుల ప్రపంచానికి పునాది వేశారు.ఈ సదస్సులలో పాల్గొని గజల్ రచన సాధన చేసిన వారిలో 8000కు పైగా గజళ్ళు రచించిన కొరుప్రోలు మాధవరావు,శ్రీ రసరాజు, డాక్టర్ ఎమ్ బిడి శ్యామల,శ్రీ తుమ్మూరి రామ్మోహనరావు తదితరులు ఉన్నారు.
గజల్ గానయోగ్యమైన ఒక సాహితీ ప్రక్రియ.క్లుప్తత,గాఢత,అభివ్యక్తి,సరళత, తాత్వికత, వ్యంగ్యం,నిందాస్తుతి, చమత్కారము,ఇంపు,కుదింపు,లాలింపు,బుజ్జగింపు,విరహము,సహనము,జ్వాల,జోల,బంధాలు, అనుబంధాలు గజల్ రచనలో ఈ అంశాలన్నీ తారసపడుతుంటాయి.
గజల్ యొక్క ఛందస్సును మీకు పరిచయం చేస్తాను.
గజల్ లో మొదటి షేర్ మత్లా, ఆఖరు షేర్ మక్తా(సాధారణంగా కవి నామముద్ర తాత్వికార్థంతో కూడి ఉండాలి)కాగా..05 నుండి 17 షేర్లు (మత్లా మక్తాలతో కలిసి)ఉండాలి.17 షేర్లు మించితే అవే కాఫియా రధీఫ్ లకు మరో కొత్త మత్లా వ్రాయాల్సి ఉంటుంది.
గజల్ లో ‘ముసల్ సల్ గజల్,గైర్ ముసల్ సల్ గజల్’ అని రెండు రకాలు.
ముసల్ సల్ గజల్ :-
అన్ని షేర్లలో ఒకే వస్తువు ఉంటుంది.మత్లాకు అనుసంధానమయ్యే ఏకసూత్రతతో కూడిన ఒక స్పందనాత్మక ధార ఉంటుంది.
గైర్ ముసల్ సల్ గజల్:-
ఒక్కొక్క షేర్ లో ఒక్కో వస్తువు తీసుకోబడుతుంది.అయితే మత్లాకు అనుసంధానమయ్యే అంతస్సూత్రతతో కూడిన స్పందనాత్మక ధార ఉంటుంది.
-:గజల్ లో తాళగతులు:-
మాత్రా ఛందస్సు: (డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి “తెలుగు గజల్”పుస్తకం నుండి)
ఉర్దూలో గణాన్ని రుక్న్ అంటారు.ఉర్దూలో ఐదు మాత్రల గణాలు రెండు.,ఏడు మాత్రల గణాలు ఐదు ముఖ్యమైనవి.
5 మాత్రల గణాలు:ఫఊలూన్;ఫాయిలున్.
7మాత్రలగణాలు:ముస్తఫయిలున్;మఫాయీలున్;ఫాయిలాతున్;మత్ ఫాయిలున్;మఫఊలాత్.
ప్రఖ్యాత తెలుగు గజల్ కవి,విమర్శకులు డాక్టర్ పెన్నా శివరామకృష్ణ “గజల్ సౌందర్య దర్శనం”లో పైన పేర్కొన్న గణాలతో 17రకాల తాళగతుల (బహార్ల)లో అనేక గజళ్ళు రూపొందించబడినట్లు తెలిపారు.
అయితే డాక్టర్ సి నారాయణరెడ్డి తెలుగు భాషా పరిధికి అనుగుణంగా మన భారతీయ సంగీత సంప్రదాయంలో గల యీ”త్రిస్ర,చతురస్ర,ఖండ,మిశ్ర” తాళగతులను ప్రమాణంగా తీసుకుని తమ అనన్య సామాన్యమైన ప్రతిభతో అత్యద్భుతమైన (సుమారు250)గజళ్ళ సృజన గావించి గొప్ప మార్గదర్శనం చేశారని చెప్పవచ్చు.అలాగే వారి బాటలో డాక్టర్ రెంటాల శ్రీవేంకటేశ్వర రావు కూడా అనేక గజళ్ళు వ్రాశారు.
గజల్ రచనలోకి తొంగిచూస్తే..
నడక..అంటే వ్రాస్తున్న తాళగతితో లేదా బహార్ తోపాటు,కాఫియా రధీఫ్ లు సరిగా ఉండి చక్కని గజలియత్ (గజల్ యొక్క ఆత్మ)గజల్ తనం ప్రతిషేర్ లో ఉంటే అది మంచి గజల్ అవుతుంది.
ఉదా:- మత్లా:-
ఎదురుగ క్షీరసముద్రాలున్నా హృదయానికి దాహం.
కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం..!(డా.సినారె)
'దాహం' 'రధీఫ్' కాగా 'హృదయానికి,గగనానికి' 'కాఫియా'పదాలు.
య్+ఆనికి - యానికి; న్+ఆనికి - నానికి. ఇలా ఒకే అచ్చు ధ్వనితో కాఫియాలు రావాలి.
ఉదా:-
01 మత్లా:
ఎవరో ఏదో అన్నారని మూసేయకు మాయని జీవితం
ఏవో కలతలు పాకుతుంటె చించేయకు రాయని కాగితం..!(డా.సినారె)
ఇందులో రధీఫ్ లేదు.మూసేయకు, చించేయకు కాఫియా పదాలే అయినా తరువాత మిగతా షేర్లలో కాఫియాల కోసం ఆగలేదు మాష్టారు.గజల్ యొక్క భావసాంద్రతా నిర్వహణలో అంత్యప్రాసగా ప్రవహించిన గజలిది.
జీవితం,కాగితం..అంత్యప్రాస పదాలు వితం,గితం వీటిలో వ్+ఇతం; గ్+ఇతం ఇలా 'ఇ'అనే అచ్చు ధ్వనితో నడుస్తుంది గజలంతా.ఇదో పద్దతి.
అయితే ఉర్దూ హిందీలలో లాగా తెలుగులోనూ ధ్వని ప్రధానంగా కాఫియా పదాలు లేదా అంత్యప్రాసలు కనీసం రెండక్షరాల ధ్వనితో అంతమైతే ఆ గజళ్ళూ అద్భుతంగా ఉంటాయి.ఇదో పద్దతి.అయితే ముఖ్యంగా గజల్ ఒక స'రస సంభాషణా ప్రక్రియ.ఏ వస్తువు తీసుకుంటే దానితో మమేకమై జరిపే హృదయగానమయ్యే విధానం.
ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం..
గజల్ కి ప్రధానమైనది అంటే ఆత్మ 'గజలియత్' అంటే -చక్కని సమర్థింపుతో 'దావా దలీల్' అనగా మిస్రా(మొదటి పాదం)లో ఒక ప్రశ్న ఉదయించాలి.మిస్రాసానీ(రెండవ పాదంలో)వహ్వా అనిపించే జవాబు రావాలి.కవితాత్మకత అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఒప్పించి మెప్పించాలి.గాన యోగ్యమైన లయ కలిగి ఉండాలి.
మత్లా అంటే ఆకాశం.మక్తా అంటే ముక్తాయింపు. ఇంపైన ముగింపు.నింగిని నేలకు దించేంత భావుకత రమ్యతలు ఉండాలి.సాధారణంగా మత్లాలో వ్యూహం ఉంటుంది.అంటే దానిలోనే గజల్ పట్టు, నిర్వహణ..అంటే చెప్పదల్చుకున్న సంగతుల బిగింపు ఉంటుంది.
వస్తువు ఏదైనా తాత్వికతతో కొనసాగితే గజల్ కి న్యాయం జరుగుతుంది.సామాజిక అంశాలను తీసుకుంటే ఆలోచింపజేసేలా ఉంటూ వ్యంగ్య చమత్కారాలను..అన్యాపదేశంగా చెప్పడాన్ని ఆశ్రయించి సందేశాత్మకతను పండించేలా చూస్తే బావుంటుంది.
హిందీ ఉర్దూలు హలంత భాషలు.అందువల్ల కాఫియాలు హల్లుద్వనితో సరిపోతాయి.అయితే తెలుగు అజంత భాష కనుక కాఫియాలను ఎలా నిర్వహించాలనేది దానికి సంబంధించిన పరిమితుల గురించి అవగాహన తెచ్చుకుందాం.అవి వాటంతట అవే ఒదగాలంటే అందుకు తగిన తపస్సు అవసరం.(ఇప్పుడు ఎవరో సరిగా వ్రాయడంలేదని విమర్శించే పని కాదిది.)దొర్లిపోయిన తప్పులు తిరిగి చూసుకుని సవరించుకోలేకపోయినా మున్ముందు ఆ తప్పులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అంటే కాస్త ఆగాలి.మానససంద్రంలో మునిగి హృదయాకాశంలోకి చేరాలి.
సరియైన కాఫియా పదాల మరో మత్లా:-
a) మత్లా:
ముద్దిచ్చే పిల్లగాలి..పెదవులనే ఏలును కద..!
వెంటపడే పూలగాలి..గుండెలనే ఏలును కద..!
ఇందులో చూడండి :పెదవులనే ,గుండెలనే కాఫియాలు.. ఇలా వ్రాస్తే కూడా సరియైనదే.
అయితే భావుకత,గజలియత్ లు అందంగా అమరితేనే అది సరియైన గజల్ లో భాగమవుతుంది
b) మత్లా:
యోగినివో..రాగిణివో..తెలియలేను నీ లీలను..!
కలను నిలచి పిలచినావు..చూడలేను నీ లీలను..!
ఇందులో చూడండి: తెలియలేను,చూడలేను కాఫియా పదాలు.
తెలియలేనులో ‘య’లో-అ,చూడలేనులో ‘డ’లో అ
య్+అలేను, డ్+అలేను ఇలా గజలంతా కాఫియాలు ఒకే అచ్చుధ్వనితో సాగాలి.
ఇక్కడ..’నీ లీలను’ రధీఫ్
గమనిక: కాఫియా పదాలలోనూ కొంత ఉభయసామాన్యం (కామన్)గా ఉండే భాగానికి ముందు గమనించాలి..
లేను ఉభయసామాన్యం..దానికి ముందు మిస్రాలో ‘య’ ఉంది (య్+అ).మిస్రాసానీలో ‘డ’ ఉంది(డ్+ అ).ఇలా ఉండాలి.
కాఫియా పదాలలో ఉభయసామాన్యంగా ఉండే భాగానికి ముందుగల అక్షరంలో అచ్చు ధ్వనితో ప్రతి కాఫియా వస్తే అది అందమైన కాఫియా పదాల గజల్.అయితే గజలియత్ పండితేనే అది గజల్ లేదా గజల్ గీతం అవుతుంది.
c) మత్లా:
మరువలేని జ్ఞాపకాల ఆ వెన్నెల తెల్పుటెలా..!?
చిరునవ్వై విరబూసే ఆ భావన తెల్పుటెలా..!?
ఇందులో రధీఫ్ తెల్పుటెలా.
కాఫియాలు వెన్నెల,భావన ఇక్కడ చివరన గల ల,న లలో అచ్చుధ్వని ‘అ’ ఉన్నా ఇలా తీసుకోవడం సరికాదు కనీసం రెండు అక్షరాలతో కూడిన కాఫియా పదాలు రావాలి.
ఉదాహరణ:-
మత్లా:-
భరించగా కుదురునెలా..ఈ ఆరని ప్రేమచిచ్చు..!
వరమంటూ తలతునెలా..ఈ తరగని ప్రేమచిచ్చు..!
ఆరని,తరగని కాఫియా పదాలలో రని,గని;లలో అని అనే ధ్వని వలన సరియైన కాఫియాగా పరిగణించబడుతుంది.
సరికాని సంధిగత కాఫియాలు
d) మత్లా:
“నన్నునేను చూచుకునే భాగ్యమెంత మధురమోయి..!
చెలిమిగగన సీమమల్లె మిగులుటెంత మధురమోయి..!”
ఇక్కడ ‘మధురమోయి’రధీఫ్. భాగ్యమెంత,మిగులుటెంత కాఫియాలు.ఇలా సంధిగతంగా ఉన్నప్పుడు
భాగ్యము+ఎంత; మిగులుట+ఎంత ..’ము’లో ఉ., ‘ట’లో అ ఉన్నందువలన సరియైన కాఫియాలు కాజాలవు.
సరియైన సంధిగత కాఫియాలు:
ఉదాహరణ:-
మత్లా:-
నీవు మీటకుండ అసలు..పలుకదోయి ఈ సితార..!
నీకోసం గాకుండా..మ్రోగదోయి ఈ సితార..!
పలుకదు+ఓయి;మ్రోగదు+ఓయి ఇలా ఒకే సంధితో ఏర్పడితేనే సరియైన కాఫియాలు అవుతాయి.
e) బిందుపూర్వక కాఫియాల వివరణ.
కవనం,జననం,ప్రాణం,గానం,భావం,రాగం ఇలా రావచ్చు .ఎందుకంటే ఈ పదాల అసలు రూపాలు:కవనము,జననము,గానము,రాగము,భావము కనుక.
ఈ కాఫియా పదాలకు ఉదాహరణ:-
డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి గజల్
మరణానికి ఓ జననం కొనసాగింపు
భావాలకు ఓ కవనం కొనసాగింపు
పురుడు పోసుకున్న కవిత పుడమిని ఎలాలి కదా..
నీ గజలుకు ఓ గానం కొనసాగింపు..
మనసు పరుగునాపేందుకు కళ్లె మొకటి కావాలి..
నీ శ్రద్ధకు ఓ ధ్యానం కొనసాగింపు..
ప్రకృతి కొనసాగుతోంది తనను తాను రమిస్తూ..
ప్రాణానికి ఓ ప్రాణం కొనసాగింపు..
గురువే మరి గురి అయితే ఆపేదెవరు..
చిత్తానికి ఓ బాణం కొనసాగింపు..
ఎత్తులెన్ని చూశాడో శ్రీనివాసు అహం వదలి..
విజయానికి ఓ మౌనం కొనసాగింపు..!
గజలనేది ఇంపు కుదింపు చమత్కారవైభవం భావసాంద్రత కలిగి ఉంటూ..భాష భావాల సమన్వయంతో పాఠక శ్రోతల హృదయాలను గొప్ప మత్తులో తేలిస్తూ తాత్వికత వైపు నడిపిస్తూ జీవన పరమార్థపు గగనాలను చేర్చేదిగా ఉండాలి.అంతరంగ మౌనంలోంచి బాహ్యప్రపంచపు అంచులమీంచి ప్రవహించే హృదయగానమై ఉండాలి.
ఆకాశాలను దాటిన ప్రేమాకాశంలోంచి పుట్టేదే అసలైన గజల్.
గజలైనా పద్యమైనా కవిత్వమంటే నిజానికి ఏ వెతుకులాటా కాదు.
గజలంటే సంప్రదాయాల సంకెళ్ళను తెంచేస్తూనే ఎప్పటికప్పుడు వినూత్న సంప్రదాయాలను సృజిస్తూ జీవన పోరాటపు కోకిల గళంలోంచి పొంగుతూ జాలువారే మార్గదర్శక కవనం.
అంత్యప్రాస గజల్ ను “కాఫియాంత” గజల్ అనవచ్చును.
కాఫియా అంటేనే చక్కని ధ్వనితో ప్రకాశించే తరంగ ప్రకంపనావృత్తి.
కేవలం ఒకేఒక్క అచ్చు ధ్వనితో కూడా అంతం కావచ్చు.కానీ ఎంత భావసాంద్రతను,గజలియత్ ను సాధించామో.,పాఠకశ్రోతల హృదయఫలకాలపైన ముద్రించామో,. అశాశ్వతమైన ఈ లోకంలో ఆ షేర్ లేదా గజల్ కి ఎంతటి శాశ్వతత్వాన్ని అమృతత్వాన్ని ఇవ్వగలిగామో చూసుకోవాలి.
అంత్యప్రాస గజల్ కి మరో చక్కటి ఉదాహరణ.
మత్లా:-
“ఆత్మలను పలికించేదే అసలైన భాష..
ఆ విలువ కరువైపోతే అది కంఠశోష..!”(డా.సినారె)
ఇందులో ఒక అకార ధ్వనితో కూడిన అక్షరంతోనే అంత్యప్రాస గజల్ సృజన జరిగింది.భావసాంద్రతతో పాఠకశ్రోతల హృదయాలను అలరిస్తూ దోచుకున్న సినారె గారి మేటి గజళ్ళనుండి గజల్ సృజనకారులు ఎంత నేర్చుకోవాలో గమనించాలని మనవి.
మరో ఉదాహరణ:-
చిరునవ్వులాంటి మనసుంటే శిరసు వంచుతాను
మోసం దాచిన ముఖముంటే ఆ ముసుగు చించుతాను..!(డా.సినారె)
ఇక్కడ వంచుతాను ,చించుతాను అనే కాఫియా పదాలతో అంతమయింది.
అయితే తేలికైన పదాలతో గొప్ప భావాలను సృజించే చైతన్యం ఉంటేనే గజల్ జనాల గుండెల్లో ముద్రింపబడుతుందని గ్రహించాలి.ఆరబ్ దేశాలలో ప్రజలు వారి గుండెల్లోనే గాక వారు ధరించిన వస్త్రాలపై కూడా వ్రాయించుకునేవారని,అలాగే ఓ గజల్ గాని గజల్ పుస్తకం గాని ఎవరికైనా దొరికితే అదెంతో ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని మరల మరల చదువుకునేలా పాడుకునేలా తలచుకునేలా తోటివారితో పంచుకునేలా ఉండాలని గజల్ మాష్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పలుమార్లు తమ ప్రసంగాలలో సోదాహరణంగా వివరించారు.గజల్ ను హృదయస్థం చేసుకుని ఆలపించే డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి గానఫణితి సయితం ఎందరికో మార్గదర్శకంగా ఉంటూ ఉండటం తెలుగుజాతికి అత్యంత గౌరవప్రదం.
గజల్ సృజనకారులైనా గాయనీగాయకులైనా డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారితో పాటుగా ఇంకా గజల్ ప్రముఖుల సూచనలను పాటిస్తూ ఉర్దూ హిందీలలో గల రీతులను అవగాహన చేసుకుని తమదైన శైలిలో తెలుగు గజల్ ను సుసంపన్నం చేయాలని..చేస్తారని ఆకాంక్ష.
గజల్ రచనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను అవగాహన చేసుకుందాం.
చాలామంది గజల్ ని ప్రణయానికి విరహానికే పరిమితంగా భావించి వ్రాస్తుంటారు.అవి గజలియత్ ఉన్నప్పటికీ ఏకవస్తు గజల్ గీతాలుగా ఉంటాయి.అంతేకాదు ఏదో స్మశాన వైరాగ్యసంబంధిగా అనిపిస్తాయి.వేదికలపై ప్రదర్శనానుకూలత కొరవడే ప్రమాదం ఉంటుంది.పాఠకశ్రోతలను విచారసాగరంలో ముంచేయడమూ జరుగుతుంది.కొందరు సామాజికాంశాలకు మరికొందరు తాత్వికాంశాలకు పరిమితమైనదిగానూ భావించడం జరుగుతోంది.ఎవరు ఏ విధంగా అభిప్రాయపడినప్పటికీ గజల్ మాత్రం తమకిష్టమైన వారితోనో,అంశం లేదా వస్తువుతోనో బహుముఖీనంగా సంభాషించేదిగా ఉండాలనేది నిర్వివాదాంశం.గజళ్ళలో ప్రకటనలు లేదా వార్తా వ్యాఖ్యలు,పొడి వాక్యాలు,ఉపన్యాస ధోరణి లాంటివి శోభనివ్వవు.గజల్ ఛందస్సులో ఉన్న అనేక విషయాలు అంగాలుగా ఉన్నా కవి తన “ఆత్మతో అనుభూతితో ప్రతిష్ట చేసే అభివ్యక్తే గజలియత్”.అదే అసలు గజల్ యొక్క ఆత్మ.ఈ ఆత్మ లేని ఏ గజలైనా ఎప్పటికీ కాలానికి నిలబడదు.ఈ సున్నితమైన పొరను గజల్ వ్రాస్తున్న ప్రతిఒక్కరూ నిష్ఠతో..ఈ కఠినమైన వాస్తవాన్ని గుర్తెరిగి వారి హృదయాలనుండి అపురూపమైన గజళ్ళను సృజించి విందు చేస్తారని గజల్ ప్రపంచం ఎదురుచూస్తోంది.
అతి ముఖ్యమైన అంశం.
-:కాఫియా..రధీఫ్ లు:-
కాఫియా రధీఫ్ లపై ఉర్దూ గజళ్ళలోని ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ సినారె ఎన్నో గజళ్ళు రచించారు.వారు తొలిదశలో వ్రాసిన “తెలుగు గజళ్ళు”అనే గ్రంథంలో గజల్ కాఫియా రధీఫ్ లలో కొన్ని తప్పులు దొర్లాయని.,చెబుతూ ఆ తరువాత ముద్రించిన”సినారె గజళ్ళు”లో సంపూర్ణంగా కాఫియా రధీఫ్ లతో పాటు గజలియత్ ను చక్కగా సాధించినట్లు స్వయంగా పేర్కొన్నారు.అందువలన గజల్ కవులు తమ గజల్ సృజనలో పైన తెలిపిన విధంగా సరియైన కాఫియా రధీఫ్ లతో పాటు చక్కని గజలియత్ సాధిస్తారని ఆకాంక్ష.అయితే మనం రాజీ పడినా ప్రక్రియ మాత్రం ఎంతమాత్రం రాజీపడదు.మనం ఆ స్థాయిని చేరుకోవడానికి తగిన సాధన చేయవలసిందే.అందుకొరకు ప్రముఖులైన గజల్ కవుల రచనలను అధ్యయనం చేయడం తప్పనిసరి.
గజల్ లో వచ్చే ఛందస్సుకు సంబంధించిన పదాలు:-
మత్లా” :- గజల్ లో మొదటి రెండు పంక్తులు. మత్లా అంటే ఆకాశం అనే అర్థం ఉంది. కేవలం పాటకు పల్లవిలా కాదు. మత్లాలో గజల్ యొక్క వ్యూహం ఉంటుంది.
” షేర్” :- గజల్ లో ప్రతిరెండు పంక్తులను ఒక షేర్ అంటారు. షేర్ అంటే స్వతంత్ర భావంతో వుంటూనే
మత్లాకు అనుసంధానమై ఉండాలి.
మిస్రా:- షేర్ లో మొదటి పంక్తి. ఇది సామాన్యంగా ఉండవచ్చు. విశేషంగా కూడా ఉండవచ్చు.
మిస్రాసానీ:- షేర్ లో రెండవ పంక్తి. మొదటి పంక్తిని విశేషంగా సమర్థించేలా ఉండాలి.
మక్తా:- చివరి షేర్.సాధారణంగా ఇందులో కవినామముద్ర ఆధ్యాత్మికార్థంలో ఇమిడితే మంచిది. కవినామముద్ర ఏదో ఒక షేర్ లో రావచ్చును.
రధీఫ్:- గజల్ లో అంత్యపదం లేదా పదసముదాయం. ఇది మత్లాలోనూ ప్రతి షేర్ మిస్రాసానీ అంటే రెండవపంక్తిలోను వస్తుంది.అయితే చాలాసార్లు ఈ రధీఫ్ లో కూడా వ్యూహం ఉంటుంది.
కాఫియా:- మత్లాలో రెండు పంక్తులలోనూ ప్రతి షేర్ రెండవ పంక్తిలోనూ రధీఫ్ కి ముందు వచ్చే అచ్చు సహిత ధ్వని పదం.,ముఖ్యంగా అచ్చుధ్వని. తెలుగులో కాఫియా గురించి దాని సొగసులను గురించి పై ఉదాహరణలలో స్పష్టంగా గమనించవచ్చు.
తఖల్లుస్:-కవినామ ముద్ర సాధారణంగా చివరి షేర్ మక్తాలో ఒక తాత్వికార్థంతో రావాలి.ప్రౌఢత నిండిన సవినయోక్తిగాను రావచ్చు.మొత్తానికి గజల్ లో ఏదో ఒక షేర్ లోనూ రావచ్చు.అయితే కొందరు తఖల్లుస్ లేకుండా కూడా వ్రాస్తుంటారు.
చాలా ప్రధానంగా గజల్ అభివ్యక్తి విషయంలో త్రికోణపరంగా అంటే లింగపరంగా ఎవరికైనా వర్తించేలా అంటే ప్రేయసి,ప్రియుడు,భగవంతుడు ఎవరికైనా ఏకకాలంలో అన్వయించబడేదిగా ఉంటే చాలా సొగసుగా ఉంటుంది.అలాగే ఒక్కొక్క షేర్ లో ఒక్కొక్క అంశం లేదా వస్తువు తీసుకుని మత్లాకు అనుసంధానం అయ్యేలా వ్రాస్తే అదెంతో చక్కని గజల్ అవుతుంది.
గైర్ ముసల్ సల్ గజల్ ఉదాహరణ:-
గజల్.. త్రిస్రగతి:
ప్రశ్నించే నీ సత్తా..కోల్పోవుట సిగ్గుసిగ్గు..!
ఉచితాలకు ఎగబడుతూ..బతుకీడ్చుట సిగ్గుసిగ్గు..!
కష్టానికి తగినఫలం..ఇచ్చువాడె భగవంతుడు..
చెమటబొట్టు విలువెరుగక..పాలించుట సిగ్గుసిగ్గు..!
చదువుకున్నవారి తెలివి..దేశానికి ఏమిచ్చునొ..
మేధావులు తొత్తులుగా..పనిచేయుట సిగ్గుసిగ్గు..!
కన్నతల్లి దండ్రులనే..అనాథలను జేసేరా..
పిండాలను వారిపేర్న..పెడుతుండుట సిగ్గుసిగ్గు..!
జుట్టులు విరబోసుకున్న..దేవతలను ఏమంటాం..
సంప్రదాయ విలువలెల్ల..తుడిచేయుట సిగ్గుసిగ్గు..!
పెదవిచివరి వేదాంతం..ఎవరినుద్ధరించేనట..
పేదరికం మనసులలో..పెంచుకొనుట సిగ్గుసిగ్గు..!
ఓ మాధవ నీ గీతను..బోధించే సంగతేమొ..
పరమార్థం అందక’నే..జీవించుట సిగ్గుసిగ్గు..!
మరి చక్కని గజళ్ళు వ్రాసే దిశగా అడుగులు వేద్దాం.కలాలు సంధిద్దాం.
జయహో తెలుగు గజల్.
రచన: మాధవరావు కొరుప్రోలు.
ప్రఖ్యాత గజల్ కవి, హైదరాబాద్.
తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత.
ఫోన్:9866995085.
